ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెన వద్ద ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు గోదావరిజిల్లా మామిడికుదురుకు చెందిన సతీశ్, సంధ్య.. తమ ఇద్దరు పిల్లలైన నాలుగేళ్ల జశ్విన్, రెండేళ్ల బిందుతో కలిసి.. శనివారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
ఆ తర్వాత బంధువుల ఇంటి నుంచి బయలుదేరిన వీరు.. తమ ఇంటికి చేరుకోలేదు. కంగుతిన్న కుటుంబసభ్యులు.. పాలకొల్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేశారు. అయితే చించినాడ వంతెనపై ఓ ద్విచక్ర వాహనం అనుమానాస్పదంగా ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు.. నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.