నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సబ్ జైల్ ముందు ఉన్న విజయకృష్ణ జనరల్ ఆస్పత్రి ఫిజీషియన్ వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విజయకృష్ణ ఆస్పత్రిలో పనిచేసే దయానంద్(FAKE DOCTORS) ఆన్‌లైన్‌లోనూ కొవిడ్ చికిత్స చేసే స్థాయికి ఎదిగారు. మెడికల్ షాప్ యజమానితో కుమ్మక్కై అవసరం లేకున్నా రకరకాల మందులు రాస్తూ అమాయకుల నుంచి దోచుకున్నారు. ఈయనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఎండీలుగా బోర్డులు చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. దేవరకొండ నియోజకవర్గ కేంద్రంగా ఏళ్ల తరబడి నకిలీ డిగ్రీలతో(fake degrees) వైద్యం చేసిన పలువురి బాగోతం బయటపడింది.
అజ్ఞాతంలోకి..
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానిక బ్రాంచి పలు అనుమానాలతో కొందరు వైద్యుల విద్యార్హతపై తీగలాగితే డొంక కదిలింది. ఐఎంఏలో(IMA) సభ్యత్వం ఇచ్చేందుకు పట్టణంలోని పలువురు వైద్యులకు తాము చదువుకున్న ఎంబీబీఎస్(MBBS), ఎండీ(MD) ఇతర పట్టాలను సమర్పించాలని గురువారం నోటీసులు జారీ చేశారు. ఎక్కువమంది వైద్యులు తమ ధ్రువపత్రాలను అందజేశారు. కాగా ప్రముఖ వైద్యుడిగా చెలామణి అవుతున్న దయానంద్ ఎలాంటి పత్రాలు అందించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. కనీసం చరవాణి సమాచారం కూడా అందుబాటులో లేకుండా వెళ్లారు.