తొలకరి పలకరించడంతో పొలం పనుల్లో ఉన్న మూడు రైతు కుటుంబాల్లో పిడుగులు విషాదం నింపాయి. మూడు జిల్లాల్లో ఆదివారం జరిగిన ఈ ఘటనల్లో తల్లి- ఆరేళ్ల బాలుడు, ఇంటర్ విద్యార్థి, మరో రైతు మృత్యువాత పడ్డారు. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం ఇంధానిలో రైతు సెండె బడిరాం దంపతులు తమ పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళుతూ కుమార్తె, కుమారుడిని వెంట తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలవడంతో తల దాచుకునేందుకు చేనులోని చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడటంతో బడిరాం భార్య నాగుబాయి(32), కుమారుడు విష్ణు(6) అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు అంజలి(10), బంధువులు సంగీత, సేవంతాబాయి, రేణుకలు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంజలి పరిస్థితి విషమంగా ఉండటంతో కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. తల్లీకుమారుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన గుడిమెట్ల సీతారాములు, గౌరమ్మ దంపతుల ఏకైక సంతానం వేణు(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు. సెలవు రోజుల్లో వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై చనిపోయాడు. కడుపు శోకం మిగిల్చావా దేవుడా అంటూ వేణు తల్లి గౌరమ్మ రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.