మితిమీరిన వేగం.. సామర్ధ్యానికి మించి ఆటోలో ప్రయాణం.. వెరసి నలుగురి ప్రాణాలను గాల్లో కలిపేసింది. వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. నీరుకుళ్ల కటాక్షాపూర్ మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న తూఫాన్ వాహనం.. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడం వల్ల ఆటో నుజ్జునుజ్జైంది. అందులో ఉన్న కూలీలు ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఏం జరిగిందో తెలిసేలోగా అంతా స్పృహ కోల్పోయారు.
ఆత్మకూరుకు చెందిన వీరంతా.. పరిసర ప్రాంతాల్లో మిరపతోటలో పని చేసే వ్యవసాయ కూలీలు. మొత్తం 16 మంది ఆటోలో నల్లబెల్లి మండలం రంగాపురం వద్దకు వెళుతున్నారు. వరంగల్ వైపు వెళుతున్న తుఫాన్ వాహనం.. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. హుటాహుటిన క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తలపగిలి కొందరు.. కాళ్లూ చేతులు విరిగి కొందరు ఎంజీఎంలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రి పరిసరాల్లో మిన్నంటాయి.