Accident: పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి - తెలంగాణ వార్తలు
08:27 April 02
Accident: పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Accident: ఉగాది పండుగ రోజే నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని కబళించింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. మరణించిన వారిలో గౌస్ ఖాన్ (55), ఫర్హానా (45), సాధిక (55), రోషన్ (24) ఉన్నారు.
నేరేడుచర్లకు చెందిన ఐదుగురు కడప దర్గాను దర్శించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలోనే కారు ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కాగా.. తీవ్రగాయాలైన మరో వ్యక్తిని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం హైదరాబాద్కు తీసుకొచ్చారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:రూటుమార్చిన డ్రగ్ డీలర్స్.. సోషల్మీడియా, డార్క్నెట్ నుంచే డీలింగ్