Khammam Bike Lift Case Mystery: వివాహేతర బంధం.. పచ్చని కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో.. మనుషుల ఆలోచనలపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి అద్దం పడుతోంది ఖమ్మం జిల్లాలో తాజాగా వెలుగుచూసిన హత్య ఘటన. తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ఓ మహిళ ఏకంగా విష ప్రయోగం చేసి, హత్య చేయించిన ఘటన విస్మయం కలిగిస్తోంది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్.. తన కుమార్తె ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ముదిగొండ మండలం వల్లభి కాటమయ్య దేవస్థానం సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. సాటిమనిషికి సాయం చేద్దామన్న సదుద్దేశంతో.. జమాల్ సాహెబ్ గుర్తు తెలియని వ్యక్తిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే వెనక కూర్చున్న వ్యక్తి.. మోటార్ సైకిల్ దిగిపోయాడు. అనంతరం జమాల్‌సాహెబ్ అలా కొద్దిదూరం వెళ్లాడో.. లేదో.. బైక్ పైనుంచి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి తనకు ఇంజక్షన్ చేశాడని స్థానికులకు చెప్పిన జమాల్ సాహెబ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
పట్టించిన ఫోన్‌కాల్..: చనిపోతూ సాహెబ్ చెప్పిన మాటలు.. ఇంజక్షన్‌తో హత్య చేయటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్.. కేసును ఛేదించేందుకు 4 ప్రత్యేక బృందాలను నియమించారు. ఘటన జరిగిన తీరు, నిందితుల ఆచూకీ కోసం ముమ్మర విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ముందు నుంచి జమాల్ సాహెబ్ కుటుంబసభ్యులపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఫోన్ కాల్ డేటా సేకరించడం, ఆ కాల్ డేటాలో ఉన్న వివరాల ఆధారంగా ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడిన వ్యక్తులను గుర్తించారు. జమాల్ భార్య ఫోన్‌కాల్ జాబితాలో హత్యకు పాల్పడ్డ నిందితుల ఫోన్ నెంబర్లు ఉండటం, వారితోనే ఎక్కువ సార్లు మాట్లాడినట్లు ఆధారాలు లభించటంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. జమాల్ సాహెబ్ భార్య ఇమామ్‌బీని విచారించిన పోలీసులు.. చింతకాని మండలం నామవారానికి చెందిన మోహన్‌రావు, ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్, ఆర్ఎంపీ వైద్యుడు వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రెండు నెలల క్రితమే ప్లాన్..: ఇమామ్‌బీ తన ప్రియుడితో కలిసి జమాల్ హత్యకు రెండు నెలల క్రితమే పథకం రచించింది. ఇందులో భాగంగా ఆర్ఎంపీ వెంకట్ సహకారంతో విష ప్రయోగం చేసేందుకు ఇంజక్షన్ సైతం ఇంట్లోనే దాచిపెట్టింది. కాగా.. ఇంట్లో విష ప్రయోగానికి ధైర్యం చాలకపోవటంతో.. ఆ పనిని తన ప్రియుడికే అప్పజెప్పింది. ఇందులో భాగంగానే.. మోహన్‌రావు, వెంకటేశ్, వెంకట్లు జమాల్ హత్యకు ప్రణాళిక రూపొందించారు. బిడ్డ ఇంటికి వెళ్లి వస్తున్న జమాల్‌ను వీరందరూ దారికాచారు. ఈ క్రమంలోనే ఆర్ఎంపీ వెంకట్ జమాల్ బైక్ ఎక్కి.. ఇంజక్షన్ ఇచ్చి, వెళ్లిపోయాడు.