market box trading app frauds: మార్కెట్ బాక్స్ యాప్ ద్వారా పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 మంది గల ఈ ముఠాలో ఇప్పటి వరకు నలుగురిని కటకటాల్లోకి నెట్టారు. మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ నకిలీ యాప్‌ను రూపొందించి.. సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెబీలోనూ రిజిస్టర్ కాని ఈ యాప్‌లో 3 వేల మంది వరకు నమోదు చేసుకుని.. లావాదేవీలు జరిపినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అమాయకుల నుంచి ఈ ముఠా రూ.10 కోట్ల వరకు ఆన్‌లైన్ వేదికగా వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. గత ఏడాది ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
market box trading app frauds in telangana : యూపీలోని చందోలి జిల్లా పోలీసుల సహకారంతో ఈ కేసును ఛేదించినట్లు సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్ తెలిపారు. మొబైల్‌లో యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మరోవైపు 'మార్కెట్ బాక్స్' యాప్ పేరుతో నిందితులు మోసాలకు పాల్పడుతున్నారని.. ఇందులో 3 వేల మంది సభ్యత్వం తీసుకున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 10 మంది సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రూ.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టి.. రూ.34 లక్షల దాకా నష్టపోయిన బాధితుడి ఫిర్యాదుతో కేసును ఛేదించినట్లు సీపీ స్పష్టం చేశారు.