తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కేసు (Fixed Deposits Scam In Telugu Academy)ను సీసీఎస్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చందానగర్ కెనారా బ్యాంకు అధికారులు అకాడమీ రూ.8 కోట్ల నిధులు విత్‌డ్రా చేసుకుని.. నకిలీ రసీదులు పంపిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. చందానగర్ కెనారా బ్యాంకు అధికారులు చెప్పిన అంశాలను పోలీసులు పరిశీలించగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విత్ డ్రా అంశంలో (Fixed Deposits Scam In Telugu Academy) అకాడమీ అధికారులు కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు.
అకాడమీకి చెందిన నిధుల్లో రూ.8 కోట్లను అధికారులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు వరకు పలు విడతలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. వీటి రసీదులు, పత్రాలు తెలుగు అకాడమీ (Telugu Academy)లో ఉన్నాయి. డిపాజిట్ చేసిన నగదును కాలపరిమితి కంటే ముందుగా తీసుకుంటున్నామని అకాడమీ అధికారులు కెనారా బ్యాంకు అధికారులకు లేఖ రాశారు. లేఖలో డిపాజిట్ల వివరాలు, రసీదులు పంపించారు. ఆ వివరాలను పరిశీలించగా... వాటిలో కొన్ని డిపాజిట్ల గడువు ముగియడంతో నగదు తీసుకున్నారని గుర్తించారు. లేఖతో పాటు రసీదులు, పత్రాలు నకిలీవని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నకిలీ రసీదులు, పత్రాలు ఎవరు సృష్టించారు... ఇందులో ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై సీసీఎస్ పోలీసు(CCS Police)లు దృష్టి సారించారు. ఇదే తరహాలో యూబీఐ బ్యాంకు (UBI) నుంచి కూడా డిపాజిట్లు విత్‌డ్రా చేశారా అనే అంశంపైనా లోతైన విచారణ జరుపుతున్నారు. రూ.54.45 కోట్లలో యూబీఐ అధికారులు రూ.17.05 కోట్లకు మాత్రమే లెక్కలు చూపించారు. మిగిలిన రూ.36.40 కోట్లు తెలుగు అకాడమీ (Telugu Academy)కి చెందిన ఇతర బ్యాంకు ఖాతాల్లో జమ చేశారా... లేదా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కెనారా బ్యాంకులో ఉన్న రూ. 8 కోట్ల డిపాజిట్ల గడువు పూర్తైనట్లు తెలుగు అకాడమీ (Telugu Academy) ఉన్నతాధికారులకు తెలియదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డిపాజిట్లు సెప్టెంబరు 22న విత్‌డ్రా చేసుకుంటే నగదు ఎక్కడికి వెళ్లిందనే అంశంపై ఆరా తీయలేదా? అకాడమీ (Telugu Academy)లో రోజు వారీ ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించే అధికారులకు, పర్యవేక్షించే ఉన్నతాధికారులు నగదు నిల్వను ఎందుకు చూసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎఫ్‌డీల స్థానంలో నకిలీ రసీదులుంచిన విషయం కూడా తెలియని పరిస్థితిలో బ్యాంకు అధికారులు ఉన్నారా వంటి అనేక ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది. మొత్తం మీద అకాడమీ నిధుల గోల్‌మాల్ (Fixed Deposits Scam In Telugu Academy) వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:Fixed Deposits Scam In Telugu Academy: ఎఫ్‌డీల్లో మాయాజాలం.. విత్‌డ్రా చేసిందెవరు? ఫోర్జరీ జరిగిందా?
Telugu Academy Funds scam: తెలుగు అకాడమీలో గోల్‌మాల్.. రూ.43 కోట్ల మాయాజాలం