ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొత్తతండాలో ఎలుకలను చంపే మందు తిని ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. తేజావత్ మంగీలాల్, శిరీష దంపతులు కూలీలు. వీరికిద్దరు సంతానం.. కుమార్తె సాత్వికాబాయ్‌కి ఐదేళ్లు, బాబుకి మూడేళ్లు. ఆదివారం సాయంత్రం సాత్విక వీధిలో తోటి చిన్నారులతో ఆడుకునేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన సమయంలో ఆ బాలిక చేతిలో ఎలుకల మందుకు సంబంధించిన ఖాళీ ప్యాకెట్ ఉంది. చదువురాని అమాయక తల్లిదండ్రులు దాన్ని చూసి బయట పడవేశారు. అంతే తప్ప.. ప్రమాదాన్ని గుర్తించలేదు.
బిస్కట్ అనుకొని.. ఎలుకల మందు తిని - ఎలుకల మందు తిని చిన్నారి మృతి
ఆడుతూ పాడుతూ సాగే ప్రాయం.. ఏది ప్రమాదమో.. ఏది కాదో గుర్తించలేని బాల్యం.. రోజూలాగే తోటి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లింది. దారిలో ఓ ప్యాకెట్‌లో దొరికిన బిళ్లలు చూడ్డానికి బిస్కెట్‌లా ఉండటంతో తెలియక తినేసింది. కానీ తాను తిన్నది ఎలుకలను చంపే మందు అని పాపం.. ఆ ఐదేళ్ల చిన్నారి గుర్తించలేదు. ఇంటికొచ్చాక తల్లిదండ్రులూ పసిగట్టలేకపోయారు. ఎవరి నిర్లక్ష్యమో ఏమో కానీ.. ఆ పసిపాప బలైపోయింది.
అందరూ అన్నం తిని నిద్రపోయారు. అర్ధరాత్రి దాటాక చిన్నారికి వాంతులు అవుతూ.. నోటినుంచి వాసన వస్తుండటంతో తల్లిదండ్రులు అనుమానించారు. సోమవారం ఉదయమే కారేపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఏఎన్‌ఎం ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. డబ్బు లేక ఇబ్బందిపడుతుండగా స్థానికుల సహాయంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర జాప్యం జరగడంతో చికిత్స ప్రారంభించిన కాసేపటికే చిన్నారి కన్నుమూసింది. కన్నవారికి గర్భశోకం మిగిలింది.
ఇదీ చదవండి :రాష్ట్రంలో కరోనా మొదటి కేసు వెలుగుచూసి నేటికి ఏడాది