Bowenpally Missing cases : వేర్వేరు ఘటనల్లో ఐదుగురు అదృశ్యమయిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాపూజీనగర్‌కు చెందిన సురేశ్ కుమార్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాడు. గత నెల 30న తమ బంధువు ఇంట్లో జరుగుతున్న జన్మదిన వేడుకలకు వెళ్తున్నామని ఇంటి యజమాని నర్సింగ్ రావుకు చెప్పి... అంతా వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. ఈనెల 1న సురేశ్ బంధువు వెంకటేశ్వర్ సురేశ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో.. యజమాని నర్సింగ్ రావును ఆరాతీశారు. ఆయన జరిగింది చెప్పారు. ఈ విషయాన్ని వెంకటేశ్, సురేశ్ తండ్రి ధర్మపాల్‌కు చెప్పాడు. బంధువులు, తెలిసినవారిని ఆరా తీసినప్పటికీ సురేశ్, సంతోషి, లిఖిత్ కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. ధర్మపాల్ ఫిర్యాదుమేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆడుకుంటానని చెప్పి అదృశ్యం
రావులపల్లికి చెందిన భీమయ్య... చాలా సంవత్సరాలుగా న్యూ బోయిన్పల్లి చిన్నతోకట్టలో నివాసముంటున్నాడు. కూలీపని చేసుకుంటూ కుటుంబసభ్యులతో జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయి మానసిక పరిస్థితి సరిగాలేని భీమయ్య మేనల్లుడు రవికుమార్ అతనివద్దే ఉంటున్నాడు . ఈనెల ఒకటో తేదీన ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్లిన రవికుమార్ ఇంటికి తిరిగిరాలేదు. అతనికోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు భీమయ్య శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.