Land Grabbing With Fake Documents: హైదరాబాద్ శివారులో భూముల ధరలు పెరగడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి విక్రయాలకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సమీపంలోని పసుమాములలో 368, 369, 370 సర్వే నెంబర్లలో 150 గజాల స్థలం కొనుగోలు చేశాడు. అయితే కొన్నిరోజుల క్రితం.. సందీప్‌కుమార్, అజయ్, చంద్రశేఖర్, తరుణ్ కుమార్, రామారావు మరికొందరు కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వారికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి భారీగా నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా స్థిరాస్తి దళారులుగా గుర్తించారు. ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని అమ్మి సులభంగా డబ‌్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మన్సూరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ హయత్‌నగర్‌లోని 368 నుంచి 371 సర్వే నెంబర్లలోని స్థలం చాలా కాలంగా పర్యవేక్షణ లేకుండా ఉన్నట్లు గుర్తించాడు.
ఇందుకు సంబంధించిన సేల్‌డీడ్ సర్టిఫైడ్ కాపీని సందీప్‌కుమార్‌కు ఇచ్చాడు. అతను నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడంలో దిట్ట. గతంలో ఇదే తరహా కేసులో అరెస్టైన సందీప్.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత అజయ్‌తో కలిసి సందీప్ నకిలీ సేల్‌డీడ్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. వాటిపై నకిలీ రెవెన్యూ స్టాంపులను వేసి అసలైన డాక్యుమెంట్ల మాదిరిగా సిద్ధం చేశాడు.