Accident in Palamuru Lift Works : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంపుహౌస్‌లో పని చేస్తున్న ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు శివారులోని రేగుమాన్‌గడ్డ వద్ద పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-1 పనులు నడుస్తున్నాయి. పంపుహౌస్ పనుల్లో భాగంగా భూఉపరితలానికి దాదాపు 100 మీటర్ల లోతులో టన్నెల్ లైనింగ్, కేబుల్ కనెక్షన్లు, ఎర్తింగ్ పనులు చేపడుతున్నారు.దీనికి సంబంధించిన నిర్మాణ సామగ్రిని ఇనుప బకెట్ ద్వారా క్రేన్ సాయంతో కిందకు దింపుతుండగా గురువారం రాత్రి 10- 10.30 గంటల మధ్య తీగ తెగి కార్మికులపై బకెట్ (సుమారు 50 మీటర్ల ఎత్తు నుంచి) పడటంతో అయిదుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన శ్రీను (42), ఝార్ఖండ్‌కు చెందిన బోనేనాథ్ (42), ప్రవీణ్ (38), కమలేష్ (36), బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు సోనుకుమార్ (36) మృతుల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్వీందర్‌సింగ్ గాయాలతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు కూలీలు దూరంగా ఉండటంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు, గుత్తేదారు ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు గోప్యంగా ఉంచారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఈ విషయాలు ఎక్కడా బయటకు చెప్పవద్దని, దీని గురించి మాట్లాడితే పని నుంచి తొలగిస్తామని గుత్తేదారు ఏజెన్సీ ప్రతినిధులు హెచ్చరించినట్లు కొందరు కార్మికులు చెబుతున్నారు. కొందరు కూలీల ద్వారా శుక్రవారం వివరాలు తెలిశాయి.
తుప్పు పట్టినా పట్టించుకోలేదు?:ఈ ప్రమాదానికి అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారు ఏజెన్సీ సంస్థ నిర్లక్ష్యం కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పంపుహౌస్‌కు నిర్మాణ సామగ్రిని పంపించే క్రేన్‌కు సంబంధించిన తీగలు తుప్పు పట్టినట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ క్రేన్ పాతబడిందని..ఈ ప్రమాదకర పరిస్థితిలో తాము పని చేయలేమని కొందరు కార్మికులు గతంలో అధికారులు, ఏజెన్సీ ఇంజినీర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా బలవంతంగా పనులు చేయిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్యాకేజీ-1వద్ద బిహార్, ఝార్ఖండ్, అస్సాం, ఏపీకి చెందిన సుమారు 2వేల మంది పనిచేస్తున్నారు.