అతివేగమనే పొరపాటు.. రెండు కుటుంబాల్లోని ఐదుగురిని బలితీసుకోవడంతోపాటు.. ఆయా కుటుంబాల్లోని ఐదుగురు చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. సంగారెడ్డి జిల్లా చౌటకూరు శివారులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఈ విషాదానికి కారణమైంది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో కారు ప్రయాణిస్తున్న అయిదుగురు ఘటనా స్థలి లోనే ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటకు చెందిన పుర్ర అంబదాస్ (33), పద్మ (25) దంపతులకు ఇద్దరు కుమారులు. అంబదాస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు వినయ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు వివేక్ (6) వారంరోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు.. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడు అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు తేల్చిన వైద్యులు మూడు రోజుల క్రితం శస్త్రచికిత్స చేశారు. శుక్రవారం ఇంటికి వెళ్లి పోవచ్చని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని వారు తమ శ్రేయోభిలాషి, రంగంపేటకు చెందిన చర్చి పాస్టర్ లూక (44) కు తెలియచేశారు. ఆయన భార్య దీవెన (41) తో కలిసి ఉదయాన్నే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు.
ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తూ...
మధ్యాహ్నం వారంతా కారులో తిరుగు పయనమయ్యారు. 2.30 గంటల సమయంలో చౌటకూరు మండల కేంద్ర శివారులో ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఢీకొన్న వేగానికి కారు ముందుభాగం నుజ్జయి లారీ ముందుభాగంలో ఇరుక్కుపోయింది. కారు నడుపుతున్న లూకతోపాటు ఆయన భార్య దీవెన, వెనక సీట్లో కూర్చున్న అంబాదాస్, పద్మ, వివేక్ అక్కడికక్కడే మరణించారు. పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి, జోగిపేట ఎస్సై వెంకటేశ్‌లు సహాయ చర్యలు చేపట్టారు. లారీ ముందుభాగంలో ఇరుక్కుపోయిన కారును జేసీబీ సహాయంతో బయటకు తీయించారు. ‘కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని’ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టిందన్నారు.