Car fire in Chittoor : రెండు కుటుంబాలు.. మొత్తం ఎనిమిది మంది. మొక్కు తీర్చేందుకు తిరుపతికి బయల్దేరారు. అప్పటివరకూ ఆనందక్షణాలు.. ఆత్మీయరాగాలు! అలా సాగుతున్న వారి అధ్యాత్మిక ప్రయాణాన్ని మృత్యువు వెంటాడింది. ఒకరి వెంట ఒకరిని తీసుకెళ్లిపోయి.. వారి ఇంట పెను విషాదాన్ని నింపింది. క్షణాల్లోనే ఐదుగురు ప్రాణాలను.. తన ఒడికి చేర్చుకుంది. ఇందులో అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి కూడా ఉంది. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగింది.
ఏం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. 5 నెలల చిన్నారి మొక్కు తీర్చేందుకు షిఫ్ట్ కారులో తిరుపతికి బయల్దేరింది. రేపు శ్రీవారి దర్శనం ఉండటంతో కాణిపాకంలోని సిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ్నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఉన్న పుతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు.