Boys died in Munneru Vagu: ఏపీలోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో మున్నేరులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా స్నేహితులందరూ కలిసి గ్రామం చివర ఉన్న ఏటికి ఈతకు వెళ్లారు. సాయంత్రమైనా చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. అన్నిచోట్లా వెతికారు. మున్నేటి ఒడ్డున సైకిళ్లు, చెప్పులు, దుస్తులు కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏటి మధ్యలో గట్టుపై ఎక్కడో ఒకచోట బిడ్డలు క్షేమంగా ఉంటారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Boys died in Munneru Vagu: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు - Five Childrens Missing in chandarlapadu
Boys died in Munneru Vagu: సంక్రాంతి సెలవులు సరదాగా గడుపుదామనుకున్న ఆ స్నేహితులను మృత్యువు ఇసుక గుంతల రూపంలో కబళించింది. ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులను మున్నేరు మింగేసింది. ఇంటి నుంచి ఆడుతూ పాడుతూ వెళ్లిన బిడ్డలు ఎక్కడో ఓచోట క్షేమంగా ఉండి ఉంటారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. ఐదుగురు చిన్నారుల మృతితో ఏపీలోని కృష్ణా జిల్లా ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి.
మృతులు ఏటూరుకు చెందిన గురజాల చరణ్, కర్ల బాలయేసు, జెట్టి అజయ్, మాగులూరి సన్నీ, మైలా రాకేశ్‌గా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన చిన్నారులు... గతంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన గుంతలు గుర్తించక నీటమునిగి చనిపోయారు. తొలుత ఈతగాళ్లు, జాలర్లతో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. మున్నేరును జల్లెడపట్టిన బృందాలు ఒక్కొక్క మృతదేహాన్ని వెలికితీసింది. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘటనా స్థలికి చేరుకొని తల్లిదండ్రులను ఓదార్చారు.
పిల్లల వివరాలు..
- చరణ్(14)
- బాల యేసు(12)
- అజయ్(12)
- రాకేశ్(11)
- సన్ని(12)
- ఇదీ చదవండి :ఆత్మహత్యకు కారణమైన ప్రేమ వ్యవహారం.. టీనేజర్ మృతి