SMUGGLING TIGER SKIN : పులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠా అరెస్ట్ SMUGGLING TIGER SKIN: రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లలో అనుకూల పరిస్థితులు ఉండటంతో పులుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా ఏటా వీటి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం... పులులను చంపి.. చర్మం, గోళ్లు ఇతర భాగాలతో సొమ్ము చేసుకుంటున్నారు.. వేటగాళ్లు. మంగళవారం... పులిచర్మంతో ములుగు వైపు వెళ్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గడ్ నుంచి పులి చర్మం అమ్మేందుకు వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వీరంతా వెంకటాపురం, ఏటూరినాగారం, టేకులపల్లి మండలవాసులని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో పులి చర్మాన్ని కొని.... ఎక్కువ రేటుకు ఇక్కడ అమ్మేందుకు తీసుకువచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పులిని దారుణంగా చంపేశారు..
ఈ ఒక్క ఏడాదిలోనే ములుగు జిల్లా పోలీసులు మూడుసార్లు పులి చర్మాన్ని సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. రెండు నెలల క్రితం తాడ్వాయ్ మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో..ఉచ్చులు పెట్టి పులిని దారుణంగా చంపేశారు. అనంతరం పులి గోళ్లు చర్మాన్ని అమ్మేందుకు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తుండగా పోలీసులుకు చిక్కారు. అక్టోబర్‌లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లిలోనూ వేటగాళ్లు ఓ పులిని చంపారు. రాష్ట్రంలో వేటగాళ్ల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మరింత ప్రణాళికబద్ధంగా పులుల సంరక్షణకు కృషిచేస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో పులుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరముంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపడతామని చెబుతున్నారు.
ఇదీచూడండి:Tiger Estimation : పులుల గణనకు పక్కా ఏర్పాట్లు..