సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.50 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి పక్కనే 132 కె.వి. విద్యుత్ ఉపకేంద్రం ఉంది. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఉపకేంద్రం వైపు వెళ్లకుండా నిలువరించారు. దీంతో మరో భారీ ప్రమాదం తప్పింది.
ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టంపై అధికారులను ఆరా తీశారు. వినియోగదారులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.