Warangal Fire Accident Today : వరంగల్ ఇసుక అడ్డా కూడలిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న పాత దర్వాజాలు, కిటికీలు విక్రయించే దుకాణాలకు చెందిన గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ఒక ఫెర్టిలైజర్ షాపు, ఓ ద్విచక్ర వాహన రిపేర్ కేంద్రానికి మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాలలోకి పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం.. రూ.కోటి ఆస్తినష్టం - వరంగల్‌లో అగ్నిప్రమాదం
Warangal Fire Accident Today : రాష్ట్రంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్, బాగ్‌లింగంపల్లి ఘటనలు మరవకముందే వరంగల్ నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇసుక అడ్డా కూడలిలో ఉన్న ఫర్నిచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.
వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సుమారు 12 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు అదుపు చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో మంటలు ఆర్పలేకపోయారు. సుమారు రూ.కోటి విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు వ్యాపారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వరంగల్ ఏసిపి గిరి కుమార్ కలకోట తెలిపారు.
మరోవైపు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.