Fire Accident in Shopping Mall Update: సికింద్రాబాద్‌లోని డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ మంటలు ఇంకా చల్లారలేదు. భవనం లోపల నుంచి పేలుడు శబ్ధాలు వినిపిస్తున్నాయి. మంటల ధాటికి భవనం కూలిపోతుందని స్థానికులు భయపడుతున్నారు. పది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నా... మంటల ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు. ఆ మంటలు మరో రెండు భవనాలకు సైతం వ్యాప్తి చెందాయి. గత ఐదు ఆరు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నా.... అవి మాత్రం అదుపులోకి రావడం లేదు.
ఆ మంటలను చూసిన చుట్టు పక్క జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఆ భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో మంటల ద్వార వెలువడే పొగలు దట్టంగా అలముకున్నాయి. ఇప్పటి వరకూ ఆ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని తన ప్రాణాలకు తెగించి సిబ్బంది రక్షించారు. పోలీసులు సైతం అక్కడికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ఇక భవనంలో మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
భవనంలో మంటల ఉద్ధృతికి పొగ అలుముకుంటోంది. దీని వల్ల సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. ఆ మంటల నుంచే వచ్చే తీవ్రమైన పొగ వల్ల ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం చూసిన చుట్టు పక్క జనాలు భవనం కూలిపోవచ్చని భయపడుతున్నారు. భవనం రెండో అంతస్తులో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్నారు. పొగలతో చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మినిస్టర్‌రోడ్‌లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇక ఈ ఘటనా స్థలికి మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు.