Fire Accident: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓంకార్ నగర్‌లోని ఎన్ ఇంటిరీయల్ గ్యాలరీ ఫర్నీచర్ షాప్, శివ మెటల్ ఎంటర్ ప్రైజెస్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఐదు అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్ని కీలలకు దుకాణంలోని ఫర్నిచర్, సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ.5కోట్ల నుంచి రూ.6కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి రాలేదని ఆరోపించారు. గంటన్నర ఆలస్యంగా రావడంతో భారీగా నష్టం వాటిల్లినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.