Inferior Goods In Online Offers: పండగలు వస్తే ఆన్‌లైన్‌లో ఆఫర్లకు కొదువే ఉండదు. ఆఫర్లు ఇస్తున్నారు కదా అని ఆన్‌లైన్ షాపింగ్‌ని గుడ్డిగా నమ్మేస్తే మోసపోయే ప్రమాదం ఉంది. ఇదే అదునుగా కొన్ని సంస్థలు నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగడుతున్నాయి. అప్రమత్తత లేకపోతే జేబులకు చిల్లుపడే అవకాశం ఉంది. ఐఎస్‌ఐ మార్కులేని వస్తువుల విక్రయాలు ఏక్కువయ్యాయి. ఇటీవలే ఐఎస్‌ఐ మార్కు లేని నాసిరకమైన ప్రెజర్ కుక్కర్లను విక్రయానికి అనుమతి ఇచ్చినందుకు సీసీపీఏ(సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. గ్రేటర్ పరిధిలో వచ్చే కేసుల్లో ఎక్కువశాతం ఎలక్ట్రానిక్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణ నాసిరకం వస్తువులకు సంబంధించినవే.
కేసుల్లో 20 శాతం ఇవే ఇ-కామర్స్ నిబంధనలను ఆయా సంస్థలు గాలికొదిలేస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి వినియోగదారుల కమిషన్లకు సైతం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తు, సేవలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి.2020 ఇ-కామర్స్ మార్గదర్శకాల ప్రకారం వస్తు, సేవలు, నాణ్యత, వస్తువు ఫీచర్స్ వంటి వివరాలను ఇ-కామర్స్ సంస్థలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.