Father murdered daughter: ఆ పాప వయసు 16 నెలలు. ఈ నెల 3 న ఇంట్లో ఆడుకుంటున్న తన వద్దకు కన్న తండ్రి వస్తుంటే తనను ఎత్తుకుని లాలించడానికి అనుకుంది. కానీ అతని కళ్లలో కామాన్ని గుర్తించలేకపోయింది. సున్నితంగా తనను దగ్గరకు తీసుకోవాల్సిన నాన్న చేతులు.. తన ఒంటిపై మొరటుగా ప్రవర్తిస్తుంటే హతాశురాలైంది. ప్రతిఘటించలేని వయసు.. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ చిన్నారి.. తన తండ్రి కీచకత్వానికి బలైపోయింది. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడి.. అనంతరం గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు ఆ దుర్మార్గపు తండ్రి. విషయమంతా తెలిసిన ఆ చిన్నారి తల్లి.. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన భర్తపై ఎదురుతిరగకుండా.. భర్తకు సహకరించి గుట్టుచప్పుడు కాకుండా తమ సొంత గ్రామంలో పాతిపెట్టాలని నిర్ణయించింది. భాగ్యనగరంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకోగా.. చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు తమ సొంత గ్రామానికి రైలులో వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.
కదలికలపై అనుమానం
చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు తమ సొంత గ్రామానికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి గుజరాత్ వెళ్లే రాజ్‌కోట్ బౌండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికులు వారి కదలికల పట్ల అనుమానం వ్యక్తం చేశారు. పాపలో ఎంతసేపైనా చలనం లేకపోయేసరికి వారిలో సందేహం కలిగింది. అప్పటికే ట్రైన్ మహారాష్ట్రకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు టీసీ, సోలాపూర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు సమీప స్టేషన్‌కు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.