కన్న తండ్రి చేతిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కొత్తపేట మాకినవారి వీధిలో జరిగింది. స్థానికంగా నివాసముండే జగ్గుపిళ్ల రాజా(35), యుగంధరి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 7 సంవత్సరాల కుమార్తె ఉంది. యూకేజీ వరకు చదివి, కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటుంది.
రాజా గొల్లపూడిలో ఓ మెడికల్ షాపులో పని చేసేవాడు. 3 నెలలుగా పనికి వెళ్లడం లేదు. పని చేయకపోతే ఇంటి ఖర్చులు ఎలా అంటూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 28వ తేదీన ఇద్దరూ గొడవ పడ్డారు. వివాదాన్ని వచ్చే ఆదివారం పెద్దల సమక్షంలో పెడతానని భార్య చెప్పింది. గురువారం మధ్యాహ్నం యుగంధరి తన కుమార్తెను తీసుకుని ఆ పక్కనే నివాసం ఉండే తల్లి ఇంటికి వెళ్లింది. రాజా తన భార్యకు ఫోన్ చేసి కుమార్తెను ఇంటికి పంపమని చెప్పాడు. ఆ చిన్నారిని ఇంటికి పంపిన వెంటనే తల్లి కూడా వచ్చింది. భర్తతో మాట్లాడిన కాసేపటికి తిరిగి తల్లి ఇంటికి వెళ్లింది.