తెలంగాణ

telangana

ETV Bharat / crime

దుర్వ్యసనాలకు బానిసైన కుమారుడిని చంపించిన తండ్రి - తంబళ్లపల్లె తాజా వార్తలు

దుర్వ్యసనాలకు బానిసయ్యాడని కన్న కొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. హత్య చేసేందుకు ఏకంగా రూ.2 లక్షల సుపారీ కూడా ఇచ్చాడు. ఈ దారుణానికి తండ్రికి మేనమామ కూడా సహకరించాడు. అసలేం జరిగిందంటే

అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా

By

Published : Aug 14, 2022, 10:10 AM IST

Updated : Aug 14, 2022, 10:28 AM IST

FATHER KILLED SON: ఏపీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి హత్య కేసులో నిందితులైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. హత్య కేసులో మృతుడి తండ్రి, మేనమామతో పాటు మరో వ్యక్తిని నిందితులుగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కుతికిబండతాండాకు చెందిన రెడ్డెప్పనాయక్‌కు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ఠాగూర్‌నాయక్‌ (22) చెన్నైలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదివేవాడు.

ఠాగూర్‌నాయక్‌

ఇంట్లోంచి బంగారు నగలు ఎత్తుకెళ్లి అమ్మగా వచ్చిన డబ్బులతో మద్యం, గంజాయి సేవిస్తూ విలాసాలకు అలవాటు పడ్డాడు. ప్రశ్నించిన తండ్రి, సోదరుడిని చంపుతానని బెదిరించాడు. ఠాగూర్‌నాయక్‌తో ఎప్పటికైనా ప్రాణహాని ఉందని భావించిన తండ్రి.. ఎలాగైనా కుమారుడిని చంపేయాలని పథకం వేశాడు.

బావమరిదితో పథకం అమలు:రెడ్డెప్పనాయక్‌ తన బావమరిది అయిన బెంగళూరు ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పెద్దమండ్యం మండలం నత్తిఓబన్నగారిపల్లెకు చెందిన బి.శేఖర్‌నాయక్‌కు సమస్య వివరించాడు. తమ కుమారుడిని చంపేస్తే రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి, ముందుగా రూ.50 వేల నగదు ఇచ్చాడు. శేఖర్‌నాయక్‌ సంబేపల్లె మండలం శెట్టిపల్లె పంచాయతీ పెద్దబిడికి గ్రామానికి చెందిన పాత నేరస్థుడు బి.ప్రతాప్‌నాయక్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

ఈ ఏడాది జూన్‌ 28న ఠాగూర్‌నాయక్‌ను మదనపల్లె శివారులోని గుట్టల్లోకి తీసుకెళ్లారు. ముగ్గురూ మద్యం తాగారు. ఎక్కువ మద్యం తాగి, మత్తులో ఉన్న ఠాగూర్‌ను గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. జులై రెండో తేదీన హత్యాస్థలం నుంచి దుర్వాసన వస్తుండటంతో పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు.

పోస్టుమార్టం నివేదికలో హత్య జరిగినట్లు తేలడంతో హత్య కేసుగా మార్చారు. సాంకేతికతను వినియోగించి నిందితులను గుర్తించారు. హత్యలో పాత్రధారులైన ప్రతాప్‌నాయక్‌ (23), శేఖర్‌నాయక్‌ (27)తో పాటు సూత్రధారి, మృతుడి తండ్రి రెడ్డెప్పనాయక్‌ (40)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:వివాదంగా మారిన కాల్పుల ఘటనపై మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఏమన్నారంటే

అత్యాచారం చేసి అబార్షన్ చేయించిన యువకుడు బాధితురాలు మృతి

Last Updated : Aug 14, 2022, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details