Father killed daughter in Mahbubnagar: అమ్మ కావాలని ఏడిస్తే.. ఇంటికి రప్పిస్తాడను కుంది.. తన దగ్గరకు వస్తున్న నాన్నను చూసి.. బుజ్జగిస్తాడనుకుంది. కానీ, ఏకంగా తన ప్రాణం తీస్తాడని ఆ చిన్నారి ఊహించలేకపోయింది. భార్యపై కోపంతో ఆరేళ్ల కుమార్తెను స్వయంగా కన్నతండ్రి హతమార్చిన అమానవీయ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ పరిధిలోని పాలకొండ తండాకు చెందిన శివకు, అదే తండాకు చెందిన శోభతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
కూలీ పనిచేసే శివ మద్యానికి బానిసయ్యి భార్యను కొట్టి వేధించేవాడు. ఇది భరించలేక పది రోజుల క్రితం తన ఇద్దరు పిల్లలతో అదే తండాలోని పుట్టింటికి వెళ్లింది. కాగా .. పెద్ద కుమార్తె కీర్తన(6) తండ్రితోనే ఉంటోంది. బుధవారం రాత్రి అమ్మ కావాలని ఆ చిన్నారి ఏడవటంతో కోపంతో ఆమె ముక్కు, నోరు మూశాడు. ఊపిరాడక చిన్నారి గిలగిలా కొట్టుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అర్ధరాత్రి చిన్నారిని తండ్రి, తాత మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని చెప్పారు.