జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లనపేటలో విషాదం చోటుచేసుకుంది. వాగులో చిక్కుకొని కొట్టుకుపోయిన తండ్రీకుమారుడు మృతి చెందారు. వంతెనపై నుంచి వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. మల్లన్నపేట వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
విషాదం.. వంతెన దాటుతుండగా కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు మృతి - heavy floods jagtial district
12:24 September 07
విషాదం.. వంతెన దాటుతుండగా కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు మృతి
మృతులు గొల్లపల్లి మండలం నందిపల్లి వాసులైన గంగమల్లు, విష్ణువర్ధన్లుగా గుర్తించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదకరంగా వంతెనలు దాటవద్దని అధికారులు సూచిస్తున్నారు.
అతలాకుతలం అవుతున్న జిల్లా
ఏకధాటిగా కురుస్తున్న వానలతో జిల్లా అతలాకుతలం అవుతోంది. రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. ఉద్ధృతంగా పోటెత్తుతున్న వరదతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాగులు, వంతెనలపై వరదల్లో చిక్కుకున్నారు. వారిని స్థానికులు, అధికారులు క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చేయిదాటి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
నిర్విరామంగా కురుస్తున్న వానలు.. ఉవ్వెత్తున పొంగుతున్న వరదలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.