ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడలో విషాదం(tragedy in andhra pradesh) నెలకొంది. కార్పెంటర్‌గా పనిచేసిన వెంకటరమణ... ఉపాధి అవకాశాల్లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పుల బాధ తాళలేక ఇంట్లో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుని గురువారం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతణ్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన శుక్రవారం మృతి చెందారు.
కూల్‌డ్రింక్ అనుకొని..
వెంకటరమణ తాగిన సీసాను ఇంట్లో పడి వేయడంతో... శీతల పానీయం అనుకొని... సీసాలో మిగిలిన విషాన్ని కుమారుడు నిహాల్, కుమార్తె యామిని తాగారు. చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కాస్త మెరుగుపడటంతో వైద్యులు పిల్లలను ఇంటికి పంపిచారు. శనివారం మధ్యాహ్నం పిల్లలకు వాంతులు రావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారుడు నిహాల్ ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె యామిని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.