భూమిపై హక్కులు దక్కనందుకు అన్నదాతలు కన్నెర్ర జేశారు. తమపై డీజిల్ పోసుకోవడంతో పాటు తహసీల్దార్ తలపై కుమ్మరించారు. మెదక్ జిల్లా శివ్వంపేటలో మంగళవారం ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. శివ్వంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన బాలు తన పొలంలో విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందారు. ఆయనకు పది ఎకరాల భూమి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టా పాసుపుస్తకం రాలేదని రైతులు తెలిపారు. ఆయన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి హక్కులు రికార్డుల్లో నమోదు కాలేదని పేర్కొన్నారు. పాసుపుస్తకాలు ఇవ్వాలని గతంలో అనేక పర్యాయాలు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పాసుపుస్తకాలు ఉంటే రైతుబంధు సాయం, రైతు బీమా పరిహారం వచ్చేదని అన్నారు.
మృతదేహంతో ధర్నా
పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లే రైతుబీమా పరిహారం రావడం లేదని బాలు మృతదేహంతో రైతులు శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో ధర్మతండా, తాళ్లపల్లి గడ్డ తండా, పుర్యా తండా, బిక్యా తండా తదితర గ్రామాలకు చెందిన సుమారు వందమంది రైతులు పాల్గొన్నారు. దాదాపు 350 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.
'అధికారుల నిర్లక్ష్యం వల్లే మేం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పోందలేకపోతున్నాం. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.'
-మృతుని బంధువు
డీజిల్ బాటిళ్లు తెచ్చుకుని కార్యాలయం ముందు బైఠాయించి కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. వారి గోడు వినేందుకు వచ్చిన తహసీల్దార్ భానుప్రకాశ్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఆయన తలపై గుమ్మరించారు. కొంత మంది తమపైనా పోసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టడి చేశారు.