తెలంగాణ

telangana

మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

By

Published : Jun 29, 2021, 12:17 PM IST

Published : Jun 29, 2021, 12:17 PM IST

Updated : Jun 29, 2021, 4:08 PM IST

diesel attack on mro
diesel attack on mro

12:14 June 29

మెదక్: శివ్వంపేట తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

మెదక్: శివ్వంపేట తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్​ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ.. కొందరు రైతులు, గిరిజనులు తహసీల్దార్ భానుప్రకాశ్​పై డీజిల్​ పోశారు.  

శివ్వంపేట మండలం తాళ్లపల్లి తండాలో మంగళవారం .. విద్యుదాఘాతంతో రైతు మాలోత్​ బాలు దుర్మరణం చెందాడు. అధికారులు సకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లనే రైతుబీమా సాయం అందలేదంటూ.. మృతుని బంధువులు, గిరిజనులు శివ్వంపేట తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఎదుట మృతదేహాన్ని ఉంచి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత ఆందోళనకారులు తమపైనే డీజిల్​ పోసుకున్నారు. అనంతరం కార్యాలయం నుంచి తహసీల్దార్​ బయటకు రాగానే.. ఆయనపైనా డీజిల్​ పోశారు. ఫలితంగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. 

ప్రయోజనాలు పొందలేకపోయాం... 

మృతుడు మాలోత్​ బాలు పేరుమీద భూమి ఉన్నా.. కొత్త పాసు పుస్తకాలు మంజూరుచేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారని వారు ఆరోపించారు. ఫలితంగా రైతుబంధు, రైతుబీమా సహా ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎంపీపీ హరికృష్ణను చుట్టుముట్టి.. 

ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీపీ హరికృష్ణనీ గిరిజనులు చుట్టుముట్టారు. తమ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. ఫలితంగా ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దారు. ఆందోళనకారుల్ని అక్కడ నుంచి పంపించారు. కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. తహసీల్దార్​ను ఆస్పత్రికి తరలించారు.  

తాళ్లపల్లి తండాలో విద్యుదాఘాతంతో మాలోత్​ బాలు మరణించారు. పరిహారం, రైతు బందు, రైతు బీమా విషయంలో మృతదేహాన్ని తమ కార్యాలయానికి తీసుకొచ్చి ధర్నా నిర్వహించారు. పరిహారంపై విద్యుత్​శాఖ ఏఈతో మాట్లాడాను. ఆ విషయం చెబుతున్న సమయంలోనే తనపై డీజిల్​ పోశారు. అటవీశాఖ భూమి సరిహద్దు ఉన్న 315,316 సర్వే నంబర్ల స్థలంలో పాసుపుస్తకాల కోసం మూడేళ్లుగా కోరుతున్నారు. దీనిపై రికార్టులు పరిశీలించి.. కలెక్టర్​కు నివేదిక ఇచ్చాం. అటవీశాఖ సిబ్బందితో.. కలెక్టర్​ సమావేశం ఏర్పాటుచేసి.. ఈ విషయంపై చర్చించారు. త్వరలోనే వారికి పాసుపుస్తకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.  

                     - తహసీల్దార్​, భానుప్రకాశ్​

విద్యాదాఘాతంతో బాలు మరణించారు. పోస్టుమార్టం నిర్వహించి.. మృతదేహాన్ని అప్పగించాం. పరిహారం కోసం తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సందర్భంలో తహసీల్దార్​పై డీజిల్​ పోశారు. ఆయన​ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

                      - స్వామి గౌడ్​, సీఐ  

ఇదీ చదవండి  :  ఈ 'అమేజింగ్​ పిల్ల'.. కొవిడ్​ బాధితుల పట్ల అన్నపూర్ణ..!

Last Updated : Jun 29, 2021, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details