జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్ అటవీశాఖ రేంజ్ అధికారి దివ్య, సిబ్బందిపై.. పోడు సాగుదారులు పెట్రోల్ పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోడు భూముల్లోని మొక్కలు నాటేందుకు గురువారం సాయంత్రం అటవీ అధికారులు.. పందిపంపుల గ్రామానికి వెళ్లారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని నిరసన చేపట్టిన పోడు సాగుదారులు ఒక్కసారిగా దాడికి దిగారు. పెట్రోల్ పోసి కర్రలతో దాడి చేశారు. గతంలోనూ పోడు భూముల్లో అధికారులు నాటిన మొక్కలను.. సాగుదారులు తొలగించారు.
దాడి గురించి తెలుసుకున్న అటవీ ఉన్నతాధికారులు పోలీసుల సాయంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన అధికారి దివ్య, సిబ్బందని భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.