సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏలేటి సంపత్ రెడ్డి అనే రైతు పంట ఎండిపోయిందన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. సంపత్‌రెడ్డి.. తన నాలుగున్నర ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నాడు. నీటి సదుపాయం లేకపోవడం వల్ల పంట ఎండిపోవటాన్ని చూసి.. రూ.2 లక్షల అప్పు చేసి ఓ బోరు వేశాడు. అందులోనూ నీరు పడలేదు. అటు పంట ఎండిపోవటం.. ఇటు అప్పు తెచ్చి వేసిన బోరులో నీరు రాకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్ రెడ్డి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పంట ఎండిపాయే... అప్పు పెరిగిపాయే... చావే దిక్కాయే! - husnabad news
"భూగర్భజలాలనే నమ్ముకుని పంట వేస్తే... ఈ ఎండలకు బావుల్లో ఉన్న నీళ్లు కాస్తా ఆవిరాయే. అప్పు తెచ్చి బోరు వేస్తే.. ఎన్ని గజాలేసినా గంగమ్మ కరుణించకపాయే. కళ్ల ముందే పంట ఎండిపోవట్టే... బాకీలేమో పెరిగిపోవట్టే... ఏమిచేసి అప్పులు కట్టాలే..." అనుకున్న ఓ రైతు... తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
యాసంగి సమయంలో బావుల్లో సమృద్ధిగా నీరు ఉన్నాయన్న భరోసాతో వరి వేశామని.. ప్రస్తుతం నీరు అడుగంటిపోయి కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. హుస్నాబాద్ ప్రాంత రైతుల చిరకాల వాంఛ అయిన గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే ఇలాంటి బాధలు తొలగిపోయి పంటలకు సరిపడా నీళ్లు అందుతాయని రైతులు కోరుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు వేశామని.. ఇప్పుడు అవి ఎండిపోయి తీవ్ర నష్టానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.