Mirchi Farmer Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నర్సాపురం తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు దిగుబడి సరిగా రాకపోవడంతో తండాకు చెందిన రైతు భూక్యా బాలాజీ(40).. అదే పొలంలో ఆత్మహత్యాయత్నం చేశారు. పండుగ పూట ఇంట్లో వాళ్లకి విషాదం మిగల్చకూడదని ఆ రైతు భావించారో ఏమో.. బాధలన్నీ కడుపులోనే దిగమింగుకుని భార్యాపిల్లలతో సంతోషంగా గడిపి పండుగ మరుసటి రోజు బలవన్మరణానికి యత్నించారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి నేడు తుదిశ్వాస విడిచారు.
అప్పులు తీరే మార్గం లేక
రైతు భూక్యా బాలాజీ.. తనకున్న కొద్దిపాటి పొలంలో మిర్చి పంట వేశారు. ఆ పంటకు తెగుళ్లు రావడం, వర్షాలు పడి ఉన్న పంట దెబ్బ తినడంతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో అప్పులు ఎక్కువై.. అవి తీరే మార్గం లేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి.. అనంతరం దెబ్బతిన్న పంట చేలు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నాలుగు రోజుల పాటు పలు చోట్ల చికిత్స పొందిన రైతు.. చివరికి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు.