Farmer Suicide at Peddamallareddy village : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో భూవివాదం కారణంగా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. భూ వివాదాల వల్లే మరణించాడని ఆరోపిస్తూ... మృతదేహాన్ని కిందకు దించకుండా కుటంబసభ్యులు ఆందోళన చేపట్టగా... ఆదివారం నుంచి చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించడానికి మృతుడి బంధువులు సోమవారం సాయంత్రం ఒప్పుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి... పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఏం జరిగింది?
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డిలో రైతు ఆత్మహత్య ఆందోళనకు దారితీసింది. గ్రామానికి చెందిన సిద్ధరాములు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పొలం గట్టు వివాదం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు మృతదేహం కిందకు దించబోమని పట్టుబట్టారు. ఆదివారం నుంచి రైతు మృతదేహం చెట్టుకు వేలాడుతూనే ఉంది. పక్కనపొలం వ్యక్తి గట్టుపై కడీలు పాతగా... సిద్ధరాములు అభ్యంతరం తెలిపారని బంధువులు తెలిపారు. రెండు కడీలు పీకేశాడని వివరించారు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సిద్ధరాములును రెండుసార్లు విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని పేర్కొన్నారు. మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు.