ధాన్యం కొనుగోలులో ఆలస్యం, అకాల వర్షం కారణంగా ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో గడ్డం లింగయ్య అనే రైతు... 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి ధాన్యం పండించాడు. 20 రోజుల కింద వ్యవసాయ మార్కెట్కు వడ్లు తీసుకొచ్చాడు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావటం వల్ల వారం రోజులుగా వస్తున్న వర్షానికి వడ్లు తడిసిపోయాయు. పండించిన ధాన్యం మొత్తం తడిపోవటం వల్ల కౌలు ఎలాకట్టాలి...? అప్పులు ఎలా తీర్చాలో తెలియక లింగయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ధైర్యం కోల్పోయిన రైతు మార్కెట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
ధాన్యం తడిసిపోయినందుకు కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
అధికారుల నిర్లక్ష్యమో.. బస్తాల కొరతనో.. మొత్తానికి ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతోంది. దీనికి తోడు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన వడ్లు కాస్తా తడిసి ముద్దవుతున్నాయి. ఈ పరిణామాలాతో అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు.
తోటి రైతులు వెంటనే స్పందించి లింగయ్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 20 రోజులుగా బస్తాలు లేవనే సాకుతో అధికారులు కాంటా వేయటం లేదని రైతులు ఆరోపించారు. దీనికి నిరసనగా... ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులంతా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే కొనుగోలు జరగటం లేదని... కాంటావేసిన బస్తాలను సైతం తీసుకెళ్లడం లేదని రైతులు వాపోయారు. స్థానిక తహసీల్దార్, సీఐ ఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా... రైతులు ధర్నాను ఉపసంహరించుకున్నారు. తక్షణమే బస్తాలు తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.