Farmer Attacked On VRO IN Pulivendula: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వీఆర్ఓపై ఓ అన్నదాత కత్తితో దాడి చేశాడు. తన భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదన్న ఆగ్రహంతో రైతు పెద్ద మస్తాన్ వీఆర్ఓపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సోమవారం కలెక్టరేట్లో స్పందనలో ఫిర్యాదు చేసి.. తన భూమిని ఆన్లైన్ చేయాలని అతను కోరాడు. దానిపై విచారించిన పులివెందుల తహసీల్దారు ఆ భూములకు సంబంధించిన అంశాలు హైకోర్టు పరిధిలో ఉన్నందున.. ఆన్లైన్ చేయలేమని తెలియజేశాడు.
అయితే ఇవాళ ఉదయం మరోసారి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పెద్ద మస్తాన్.. తన భూమి ఆన్లైన్ చేయాలని పదేపదే విజ్ఞప్తి చేశాడు. దీనికి వీఆర్ఓ కృష్ణమోహన్ నిరాకరించాడు. తన వెంట తెచ్చుకున్న చిన్నపాటి కత్తితో వీఆర్ఓ వీపుపై పొడిచాడు. కృష్ణమోహన్‌ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మస్తాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.