తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలుడి మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన - telangana crime news

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి.. శవమై ఐదు రోజుల తర్వాత లభించిన బాలుడు చైతన్య కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రహదారిపై బైఠాయించారు. కేసును తప్పుదోవ పట్టించాలని చూసిన వ్యక్తి, శిక్షణ ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

బాలుడు చైతన్య మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన
బాలుడు చైతన్య మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన

By

Published : Aug 14, 2021, 8:13 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో ఐదు రోజుల క్రితం వాగులోకి ఈతకు వెళ్లి గల్లంతై.. శవమై నేడు లభించిన బాలుడు చైతన్య కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మందమర్రి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాలుడి మృతిపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ.. పోలీసులు సరైన రీతిలో విచారణ జరపకుండా తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసును తప్పుదారి పట్టించాలని చూసిన వైఎస్​ఆర్​టీపీ నాయకులు ముల్కల్లా రాజేంద్రప్రసాద్​.. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తిని తీసుకెళ్లి విచారణ పేరిట చిత్రహింసలకు గురి చేసిన శిక్షణ ఎస్సై రమేశ్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తమకు న్యాయం చేయాలని మృతదేహంతో రహదారిపై బైఠాయించారు.

సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ ప్రమోద్​రావు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫలితంగా బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.

ఇదీ జరిగింది..

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్​కు చెందిన గట్టయ్య, తిరుమల దంపతుల చిన్న కుమారుడు చైతన్య(14) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆడుకునేందుకు స్నేహితులతో కలిసి బయటికి వెళ్లాడు. రాత్రయినా కుమారుడు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, స్థానికుల ఇళ్లలో వెతికారు. అయినా జాడ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుళ్లిపోయిన స్థితిలో..

విచారణ చేపట్టిన పోలీసులు.. చైతన్య తన నలుగురు స్నేహితులతో కలిసి నడుచుకుంటూ ఎర్రగుంటపల్లి వాగు వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి స్నేహితులను పిలిపించి విచారణ చేపట్టగా.. మొదట తమకు ఏమీ తెలియదని చెప్పారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. శుక్రవారం అర్ధరాత్రి వాగు వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడ చైతన్య దుస్తులను గుర్తించారు. అనంతరం సింగరేణి రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. రెండున్నర గంటలు శ్రమించిన అనంతరం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని వెలికితీసి.. ఈ రోజు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details