- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి రెండు నెలల కిందట గల్ఫ్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. ఇతని మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాధిత కుటుంబం రెండు నెలలుగా చివరిచూపు కోసం ఎదురుచూస్తోంది.
- కామారెడ్డికి చెందిన మరో వ్యక్తి మృతదేహం నాలుగు నెలల తర్వాత స్వస్థలానికి చేరింది. అప్పటి వరకు ఆ కుటుంబీకులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అంత్యక్రియల క్రతువు ఆలస్యమవడంతో గ్రామస్థులు వీరికి దూరంగా ఉన్నారు.
గల్ఫ్‌లో మరణిస్తున్న ప్రతి పది మందిలో ఎనిమిది మంది మృతదేహాల తరలింపునకు అవాంతరాలు నెలకొంటున్నాయి. నెలల తరబడి అక్కడి శవాగారాల్లో ఉంచుతుండటంతో వారి కుటుంబీకులు నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నారు. బాధిత కుటుంబాల ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా, అధికారులను కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా ప్రయోజనం ఉండట్లేదు. అమెరికా, బ్రిటన్, ఇంగ్లాండ్, యూకే వంటి దేశాల్లో భారతీయులు మరణిస్తే మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలోనే మృతదేహాలు తీసుకొస్తున్నారు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో నెలల కొద్దీ సమయం పడుతుండడం బాధిత కుటుంబీకులను మరింత కుంగదీస్తోంది.
ఇదీ పరిస్థితి..
- గత ఐదేళ్లలో సుమారు 632 మంది గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో మృతి చెందారు.
- ఉభయ జిల్లాలకు సంబంధించి 41 మంది కార్మికుల ఆచూకి ఇప్పటికీ తెలియలేదు.
- ఆరు నెలలుగా 18 మంది మృతదేహాల తరలింపు సాధ్యం కావట్లేదు.
- నెల రోజుల్లో ఆరుగురి మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు.
కారణాలు ఏంటంటే..?
- గల్ఫ్ దేశాల్లో మృతదేహాల తరలింపులో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రవాస భారతీయులు చెబుతున్నారు. గల్ఫ్ కార్మిక సంఘాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
- ఉభయ జిల్లాలకు సంబంధించి 3.50 లక్షలకు పైగా కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. వీరిలో 3 లక్షల వరకు కంపెనీ వీసాలపై వెళ్లగా.. మిగతా వారు విజిట్ వీసాలపై అనధికారికంగా పనులు చేసుకొని జీవిస్తున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఉంటున్నారు. పాస్‌పోర్టులు కోల్పోయినవారు, వాటిని కంపెనీల వద్ద జమచేసి వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు.
- కంపెనీల్లో పనిచేసే కార్మికుడు మరణిస్తే తదుపరి ప్రక్రియ మొత్తం యాజమాన్యమే చూసుకొంటుంది. సంబంధిత కుటుంబీకుల నుంచి నిరభ్యంతర పత్రాన్ని అక్కడి పోలీసులకు సమర్పించి ప్రక్రియను పూర్తి చేస్తారు.
- పాస్‌పోర్టులు కోల్పోయినవారు, వివిధ నేరాల్లో చిక్కుకొన్న వారు, సందర్శన వీసాలపై గడువు తీరిపోయిన వారు మరణిస్తే చాలా నిబంధనలు అడ్డుపడుతున్నాయి. మృతదేహాల కోసం కుటుంబీకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గల్ఫ్ చట్టాలు ఒప్పుకోవట్లేదు. ప్రత్యేక సందర్భాల్లో అక్కడి రాయబార కార్యాలయాలు, విదేశీ మంత్రిత్వ శాఖ చొరవతో పలువురి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేలా చూస్తున్నారు.