ఏపీలోని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో.. దొంగ ఓట్ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. నియోజకవర్గానికి సంబంధంలేని వాళ్లు.. బయట నుంచి వందల మంది నకిలీ ఓటర్లు వచ్చారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. యథేచ్ఛగా క్యూలోనే వెళ్లి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి.. తిమ్మినాయుడుపాలెం, దేవకోన, క్రాంతినగర్‌లో నకిలీ ఓటర్లు యథేచ్ఛగా ఓటు వేస్తున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో నకిలీ ఓటర్లు క్యూలో నిలబడ్డారు.. ఓటరుకార్డుపై ఓటరు నంబర్ స్టిక్కర్లుగా అంటించి ఉన్నట్లు తెదేపా నేతలు గుర్తించారు.
తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన
ఏపీలోని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి వైకాపా నేతలు తరలించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో నకిలీ ఓటర్లు క్యూలో నిలబడ్డారని.. ఓటరుకార్డుపై ఓటరు నంబర్ స్టిక్కర్లుగా అంటించి ఉందని గుర్తించామన్నారు.
లక్ష్మీపురం, కెనడీనగర్, జయనగర్, పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో వేరే ప్రాంతం వాసులు తిష్ఠ వేశారు. అనుమానం రాకుండా వీధుల్లో ఐదుగురు చొప్పున బయటి వ్యక్తులు తిరుగుతున్నారు. ఒక్కొక్కరుగా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా నేతలు బయటి నుంచి వేల మందిని తిరుపతికి బస్సులు, కార్లలో తీసుకువచ్చారంటూ తెదేపా నేతలు చెబుతున్నారు. వారందరికీ కల్యాణ మండపాల్లో వసతి ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇతర ప్రాంత వ్యక్తుల కదలికలపై తెదేపా, కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టారు. స్థానికులకు ఓటు వేసే అవకాశం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:సాగర్ పోరు: పలు కేంద్రాల్లో మొరాయిస్తున్న ఈవీఎంలు