ఏటా తొలకరి రాగానే నకిలీ విత్తన దందా విచ్చలవిడిగా సాగుతోంది. వ్యవసాయశాఖ పెట్టే కేసులకు ఏ మాత్రం భయపడకుండా అక్రమార్కులు యథేచ్ఛగా నకిలీ విత్తనాలు, గడువు ముగిసిన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇంతవరకూ ఎవరికీ జైలుశిక్ష పడకపోవడం, విత్తనచట్టం బలహీనంగా ఉన్నందున పట్టుబడినా ఏం కాదులే అన్న ధీమాతో వీరు విక్రయాలు ఆపడం లేదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు.
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తెప్పించి తెలంగాణలో విక్రయిస్తున్నారు. ఏపీలోని గుంటూరు, కర్నూలు, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, మహారాష్ట్రలోని నాందేడ్ న్రుంచి సరిహద్దు జిల్లాలకు వస్తున్నాయి. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఏపీ గ్రామాల్లోని వ్యాపారులు ‘యూఎస్ -341’ పేరు గల మిరప విత్తనాల విక్రయాలకు ఏపీ వ్యవసాయశాఖ నుంచి లైసెన్సు తీసుకున్నారు. వీటిని తెలంగాణలోని గ్రామాలకు తరలిస్తున్నారు. ఒక ప్యాకెట్‌లో కేవలం 7 గ్రాముల విత్తనాలను రూ.520కి అమ్ముతున్నారని పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి అలివేణి చెప్పారు. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ శివారులో ఈ వ్యవసాయాధికారి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి విచారణలో జయశంకర్ జిల్లా మల్హర్ మండలం గాదెంపల్లి గ్రామంలోని శ్రీనివాస ఎరువుల దుకాణంలో ఏకంగా 817 విత్తన ప్యాకెట్లు లభించాయి.
- ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో రూ.6 లక్షల విలువైన యూఎస్ -341 మిరప విత్తనాలు దొరికాయి. వాటిని సాగుచేసి నష్టపోయామని ఇదే వెంకటాపురం మండలం రైతులు గత ఏడాది కోర్టుకెళ్లినా వాటిని ఉత్పత్తి చేసిన కంపెనీ పరిహారం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇప్పుడు మళ్లీ అదే మండలంలో అవే విత్తనాలను అక్రమంగా అమ్ముతున్నారు.
- హైదరాబాద్‌లోని వనస్థలిపురం దగ్గర ద్వారకా సీడ్స్ పేరుతో ఓ వ్యక్తి విత్తన వ్యాపారం చేస్తున్నాడు. యథేచ్ఛగా వందల క్వింటాళ్ల విత్తనాలను అమ్మేస్తున్నాడు. గత ఏడాది నాసిరకం విత్తనాలు విక్రయిస్తుంటే వ్యవసాయాధికారులు కేసు పెట్టారు. ఈ ఏడాది వర్షాలు ప్రారంభం కాగానే మళ్లీ పక్క రాష్ట్రాల నుంచి నాసిరకం విత్తనాలు తెచ్చి జిల్లాలకు తరలించి అమ్మడం ప్రారంభించాడు. ఈసారి పోలీసులు అతని చరిత్రపై లోతుగా విచారణ చేయిస్తే కొన్నేళ్లుగా నాసిరకం విత్తనాలు అమ్ముతున్నట్లు తేలింది. ఇతని వ్యాపారం తీరు పోలీసులనే ఆశ్చర్యపరిచింది.
పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన స్థానిక రాజకీయ నేత పిట్టల రవికుమార్ మరికొందరితో నాసిరకం విత్తనాల వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో స్పష్టంగా తేలింది. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన బాచిన వెంకన్న నుంచి విత్తనాలు తెచ్చి ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకుని మరీ అమ్మిస్తున్నారు. రవికుమార్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.