కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి (Nellore Swami) ఇంటర్ కూడా పాస్ కాలేదు. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశాడు. తన ప్లాన్‌కు పోలీస్ ఉద్యోగం అయితేనే కరెక్ట్ అనుకున్నాడు. అంతే... ఓ డీఎస్పీ స్థాయి సూట్ రెడీ చేసుకున్నాడు. గుర్తుపట్టకుండా గుర్తింపు పొందిన నకిలీ ఐడీ కార్డులు సృష్టించాడు.
తన కారుకు పోలీస్ స్టిక్కర్ వేసి రోడ్లపై తనిఖీలు మొదలు పెట్టాడు. ఇసుక టిప్పర్లు, ఇతర సెటిల్మెంట్లు చేయడం ప్రారంభించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాలోని పలువురు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అంతా మన వాళ్లే ఉన్నారంటూ గాలం వేశాడు. ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేశాడు.
కోటి వరకు వసూల్...
ఇలా తన ముఠాతో కలిసి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాలోనూ 20 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద రూ. 5 నుంచి 10 లక్షల చొప్పున సుమారు కోటి వరకు వసూలు చేశాడు. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు నెల్లూరు స్వామి... బీబీపేట, తుజాల్పూర్ బస్టాండ్ల వద్ద వాహనాన్ని నిలుపుకొని పోలీసుల మాదిరి విధులు నిర్వహిస్తూ మరి వసూళ్లకు పాల్పడేవాడని ఆరోపణలున్నాయి.