గొర్రెలు, మేకల వ్యాపారులే లక్ష్యం.. పోలీసుల అవతారంలో దోపిడీలు.. Fake police Gang Arrest: హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఖాజా వాహబుద్దీన్, మహ్మద్ తాజూద్దీన్, మహ్మద్ ఇసాక్.. ముంబాయికి చెందిన షేక్ ఇమ్రాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన తైమూర్, అమీర్‌లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఇళ్లలో దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్‌లతో విసుగెత్తిన ఈ బృందం.. ఏకంగా నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. ఓ ఇన్నోవా వాహనంతో పాటు ఓ పిస్టల్, కత్తులు, పోలీసులు ఉపయోగించే హ్యాండ్ మైక్ సమకూర్చుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు గొర్రెలను, మేకలను తీసుకువచ్చే వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని చోరిలకు పాల్పడ్డారు.
పత్రాలు చూపించాలని బెదిరింపులు..
ఈ నెల 8న తెల్లవారు జామున మహారాష్ట్ర ఉస్మానాబాద్ నుంచి హైదరాబాద్‌కు గొర్రెలను తీసుకువస్తున్న ఓ వాహనాన్ని ఆపి బెదిరింపులకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద వాహనాన్ని ఆపి గొర్రెలు, వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించాలంటూ వ్యాపారులను కిందకు దించారు. దిగిన తర్వాత వారిని కొట్టి తమ ఇన్నోవాలో బలవంతంగా కూర్చోపెట్టుకున్నారు. దొంగల మూఠాలోని ఓ వ్యక్తి గొర్రెలు తరలిస్తున్న వాహనంతో పరారు కాగా... వ్యాపారులను బాహ్య వలయ రహదారి మీదుగా తీసుకెళ్లి మేడ్చల్ వద్ద వదిలారు.
వాహనంలోనే కొట్టి..
ఈనెల 13న తెల్లవారుజామున ఇదే బృందం మరో నేరానికి పాల్పడింది. మహారాష్ట్రలోని చెక్లీ గ్రామం నుంచి హైదరాబాద్‌కు గొర్రెలు, మేకలతో వస్తున్న వాహనాన్ని రుద్రారం గ్రామం సమీపంలో నకిలీ పోలీసుల ముఠా ఆపింది. ఓ వ్యక్తి గొర్రెలు తరలిస్తున్న వాహనంతో వెళ్లిపోగా.. వ్యాపారులను ఇన్నోవా వాహనంలోనే కొట్టి.. వారి నుంచి సెల్ ఫోన్లు, డబ్బులు లాకున్నారు. అనంతరం శామీర్‌పేట సమీపంలో వ్యాపారులను దించి మిగిలిన సభ్యులు సైతం పరారయ్యారు.
గొర్రెలు అమ్మడానికి వచ్చి..
ఐదు రోజుల వ్యవధిలో ఒకే తరహ కేసులు ఒకే స్టేషన్ పరిధిలో రెండు జరగడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నేరం జరిగిన పరిసర ప్రాంతాలతో పాటు అనుమానం ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమేరాల దృశ్యాలను పరిశీలించారు. హైదరాబాద్ ముఖ్యమైన గొర్రెల మార్కెట్ల వద్ద నిఘా పెట్టారు. సోమవారం ఉదయం జియాగూడ మార్కెట్లో గొర్రెల అమ్మడానికి వచ్చిన ఓ వ్యక్తిపై అనుమానంతో విచారిస్తే.. మొత్తం వ్యవహారం బయట పడింది.అతడిచ్చిన సమాచారంతో చాంద్రాయనగుట్టలోని ఓ హోటల్ వద్ద మూఠాలోని ఖాజా వహబుద్దీన్, తాజూద్దీన్, ఇసాక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఓ పిస్టల్, 7 బుల్లెట్లు, రెండు కత్తులు, 74 వేల 500రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. డబ్బులు అవసరం ఉన్న వారిని గుర్తించే ఖాజా వహబుద్దీన్....వారితో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఖాజా వహబుద్దీన్ పై ఇప్పటికే 52 కేసులు ఉండగా 100 వరకు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: