తెలంగాణ

telangana

ETV Bharat / crime

పరీక్షల్లేవ్‌, ఫొటోషాప్‌తో పాస్‌, నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ - రాచకొండ పోలీస్​

Fake certificate making gang arrest నిరుద్యోగులు, నిరక్షరాస్యులైన యువతను లక్ష్యంగా చేసుకుని నకిలీ ధ్రువపత్రాల దందా నడిపిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వివిధ విశ్వవిద్యాలయాల, ఇంటర్​ బోర్డుల సర్టిఫికేట్​లను స్వాధీనం చేసుకున్నారు.

Fake certificate making gang
నకిలీ ధ్రువపత్రాల తయారీ ముఠా

By

Published : Aug 24, 2022, 11:37 AM IST

Fake certificate making gang arrest పుస్తకాల్లేవు, పరీక్షల్లేకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పది, ఇంటర్‌ బోర్డులు, విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి వందలాది మందికి విక్రయించిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులు, నిరక్షరాస్యులైన యువతను లక్ష్యంగా చేసుకుని నకిలీ దందా నడిపిస్తున్న నలుగురినీ, వారి నుంచి సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తున్న ఇద్దరిని ఎస్‌వోటీ ఎల్బీనగర్‌, బాలాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఠా ప్రధాన సూత్రధారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి ఆంధ్రా యూనివర్సిటీ, ఏపీ ఇంటర్‌ బోర్డు, మహారాష్ట్ర, దిల్లీ బోర్డులు, బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ ధ్రువపత్రాలు, వివిధ యూనివర్సిటీలకు చెందిన లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌ పత్రాలు, నకిలీ టీసీలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు.

రూ.1-2లక్షలే:చాంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన మహ్మద్‌ కలీముద్దీన్‌ నకిలీ ధ్రువపత్రాల తయారీ, సరఫరా రాకెట్‌కు ప్రధాన సూత్రధారి. తన మిత్రులు ముక్తార్‌ అహ్మద్‌(40), ఎండీ ఫిరోజ్‌(42)కు కమీషన్‌ చెల్లిస్తుండగా వారు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కళాశాల డ్రాపౌట్లు, నిరుద్యోగులకు రూ.1లక్ష నుంచి రూ.2 లక్షలకు ధ్రువపత్రాలను విక్రయిస్తున్నారు. ఈ నెల 22న సమాచారం అందుకున్న పోలీసులు బాలాపూర్‌ ఎర్రకుంటలోని కేక్‌ కింగ్‌ బేకరీ దగ్గర ఏజెంట్‌ సరూషుల్లా ఖాన్‌ నుంచి ధ్రువీకరణపత్రాలు కొనుగోలు చేస్తున్న జుబేర్‌ అలీ(25), సయ్యద్‌ అతీఫుద్దీన్‌(25)ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏజెంట్​ ఇచ్చిన సమాచారంతో మెహదీపట్నం ఏసీ గార్డ్స్‌లో ఉండే ఫరూక్‌ అజీజ్‌(దుండిగల్‌లోని ఓ మసీదులో ఇమామ్‌), ఫిరోజ్‌, ముక్తార్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసులో రెండో నిందితుడు ముక్తార్‌ అహ్మద్‌ ఫొటోషాప్‌ వినియోగిస్తూ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నాడు.

నకిలీ పత్రాలతో విదేశాలకు..ఇప్పటివరకూ నిందితులు దాదాపు 258 మందికి లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌ (ఎల్‌ఓఆర్‌) జారీ చేశారు. వీరు కాక మరింత మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ల్యాప్‌టాప్‌లో వివిధ యూనివర్సిటీలకు చెందిన గుర్తులు, ధ్రువపత్రాలు తయారుచేసే వ్యవస్థ, హోలోగ్రామ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకూ 8 మంది విదేశాలకు వెళ్లినట్లుగా ఆధారాలు లభించాయి. ప్రధాన నిందితుడు దొరికితేనే మరింత సమాచారం తెలిసే అవకాశాలున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details