కరోనా పేరు చెబితేనే అందరూ వణికిపోతుంటే.. సైబర్ నేరగాళ్లు తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొవిడ్ చికిత్స పేరు చెప్పి అందినంత దోచుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ నకిలీ ఖాతాలు సృష్టించి.. స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి మెసేజ్లు పంపి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఉదంతమే తాజాగా ఏపీలోని విజయవాడలో వెలుగుచూసింది. గుణదలలో నివసించే వైద్యుడు రాజశేఖర్ ఫేస్బుక్ ఖాతాకు రాత్రి వేళ.. తనకు తెలిసిన ఓ ఉపాధ్యాయుడి ఫేస్బుక్ ఖాతా నుంచి మెసేజ్ వచ్చింది.
ఓ విద్యార్థికి కొవిడ్ సోకింది.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఆర్థిక సహాయం చేయండని అవతలి వ్యక్తి మెసేజ్ చేశాడు. ఆ ప్రొఫైల్లో ఉపాధ్యాయుడి ఫోటో, వివరాలు ఉండటంతో.. అంతా నిజమని నమ్మిన రాజశేఖర్.. అతడితో చాటింగ్ చేశాడు. అవతలి వ్యక్తి తన గూగుల్ పే ఖాతాకు డబ్బు పంపాలని కోరగా.. రాజశేఖర్ విడతల వారీగా 50 వేల వరకు నగదు పంపారు.