హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad by election) సందర్భంగా నియోజకవర్గ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో హుజురాబాద్ వైపు వచ్చే అన్ని మార్గాల్లోనూ సోదాలు చేపట్టారు (vehicles checking). సోమవారం జమ్మికుంట మోత్కుల గూడెం వద్ద రూ.4 లక్షలు, గాంధీ చౌక్ వద్ద 5 లక్షలు, ఫ్లై ఓవర్ వంతెనపై 1.5 లక్షల నగదును ముగ్గురు వేర్వేరు వ్యక్తులు బైకులపై తీసుకెళ్తుండగా టాస్క్ ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నారు.
అలుగునూరులో రూ. 4.5 లక్షలు స్వాధీనం
కరీంనగర్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా (police checking) ఎలాంటి రసీదులు లేకుండా తీసుకెళ్తున్న రూ.4.5 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఆదాయపు పన్నుశాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మరో వైపు హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన సోదాల్లో ఓ కారులో తీసుకెళ్తున్న చీరలను గుర్తించారు. అవి ఓ వస్త్ర దుకాణానికి సంబంధించినట్లుగా రసీదులు చూపించడంతో విడిచిపెట్టారు. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వాహనాల్లోను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
మంత్రి గంగుల వాహనంలోను సోదాలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా మంత్రి గంగుల కమలాకర్ పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆయన హుజూరాబాద్‌కు వస్తుండగా.. ఆయన వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేశారు.