EX Sarpanch Ramesh killed by Maoists: ములుగు జిల్లా వెంకటాపురం మండలం కే. కొండాపురం మాజీ సర్పంచిని మావోయిస్టులు అపహరించి… అనంతరం హత్య చేసిన ఉదంతం… ఏజెన్సీ వాసులను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. కిడ్నాప్ చేసి దట్టమైన అటవీ ప్రాంతంలో కళ్లకు గంతలు కట్టి ఏడుగంటలు నడిపించి క్రూరంగా తుపాకితో కాల్చి హతమార్చారు. ఛత్తీస్గఢ్పరిధిలోని కొత్తపల్లి వద్ద మృతదేహం వదిలి వెళ్లారు. ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించే వారికి ఇదే దుర్గతి పడుతుందంటూ అక్కడే లేఖ వదిలి వెళ్లారు.
సోమవారం.. చర్లకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రమేశ్.... ఇంటికి తిరిగి రాలేదు. మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో... అతని భార్య రజిత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకి హాని తలపెట్టవద్దని...వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన జరిగి 24 గంటలు కాకముందే... ఛత్తీస్‌గఢ్ సమీపంలో కొత్తపల్లి గ్రామ అటవీ పరిసరాల్లో రమేశ్ మృతదేహం ఈ ఉదయం లభ్యమైంది. అంతేకాదు ఏ విధంగా పోలీసులు తనను ఒత్తిడి చేసిందీ.. ఎంత డబ్బులిచ్చారన్నదీ రమేశ్ స్వయంగా మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి మావోయిస్టులు విడుదల చేశారు.
రమేష్‌ను మావోయిస్టులు హత్య చేయడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడి మృతదేహంతో గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీస్ శాఖ వ్యవహరించిన తీరు వల్లే రమేశ్ చనిపోయాడని ఆరోపించారు. ఎస్సై తిరుపతి ఘటనాస్థలానికి రావాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు వాడుకుని వదిలేశారని.. తన భర్త మృతికి న్యాయం చేయాలని మృతుడి భార్య పేర్కొన్నారు.
''నా తరఫున ఎవరు పోరాడతారు. పోలీసులు డ్యూటీ చేయరా? అవసరమున్నప్పుడు వాడుకున్నారు నా భర్తని. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడిగారు. పోలీసులు కాల్‌లిస్టు మొత్తం తీయాలి. నాకొక క్లారిటీ రావాలి. నా భర్తని ఎవరు చంపారో నాకు తెలియాలి. నా భర్త ఒకరికి అన్యాయం చేసినవాడు కాదు. ఈ ఊరు చుట్టుపక్కల అంతా ఎంక్వైరి చేయండి. పోలీసులకు తెల్వదా నా భర్త ఎలాంటి వాడో.''