తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్షణికావేశం, మద్యం మత్తులో విచక్షణ మాయం.. మహానగరంలో ఏటా 300కు పైగా హత్యలు - Murders in hyderabad 2022

Murders in Greater Hyderabad: పాత‌ప‌గ‌లు లేవు.. ప్ర‌తీకారాలు క‌నిపించ‌వు.. ఆస్తి త‌గాదాలంటే అస్స‌లు కాదు.. అయినా రెప్ప‌పాటులో చేతికి దొరికిన వ‌స్తువుతో అవ‌త‌లి వాడిని చంపేస్తున్నారు. వేడి చ‌ల్లారాక తాము నేరం చేసిన‌ట్టు గుర్తించి ల‌బోదిబోమంటున్నారు. మ‌ద్యంమ‌త్తు, క్ష‌ణికావేశం, వివాహేత‌ర సంబంధాలు.. కార‌ణాలేమైనా హైదరాబాద్​ న‌గ‌రంలో హ‌త్య‌లు పెరుగుతున్నాయి. అప్ప‌టి వ‌ర‌కూ మంచోళ్లుగా ఉన్న‌వారు క్ష‌ణాల్లో నేర‌స్థులుగా మారుతున్నారు. విచక్షణ మరచి.. చంపేసుకుంటున్నారు.

Murders in Greater Hyderabad
హైదరాబాద్​లో దారుణ హత్యలు

By

Published : Mar 14, 2022, 8:01 AM IST

Murders in Greater Hyderabad: మార్చి 1 ఉదయం ఇబ్రహీంపట్నం కర్ణంగూడ వద్ద భూ వివాదాలతో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారుల హత్యలు.. మార్చి 10 రాత్రి జీడిమెట్లలో కుటుంబ తగాదాలతో ఇద్దరు హతమయ్యారు. మార్చి 11 సాయంత్రం శంషాబాద్‌ గగన్‌పాడు వద్ద మద్యం మత్తులోఉన్న యువకుడు పెద్దబండరాయితో మరో యువకుడిని చంపేశాడు.

క్షణికావేశంలో

రోజూ కలిసే తిరుగుతున్నారు. కష్టసుఖాలు పంచుకుంటున్నారు. అంతలోనే శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటారు. క్షణికావేశంలో హత్యలు చేసేంత వరకూ చేరుతున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో గతేడాది జరిగిన ఓ హత్యలో 11 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు డిగ్రీ విద్యార్థి. మద్యం మత్తులో ఏం చేస్తున్నాననేది మరచిపోయానంటూ పోలీసులు అరెస్ట్‌ చేశాక బోరుమన్నాడు. గతేడాది సైబరాబాద్‌ పరిధిలో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. తాను కొట్టడం వల్లనే మిత్రుడు మరణించాడని తెలిసిన నిందితుడు ఠాణాలోనే వెక్కివెక్కి ఏడ్చాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాను చంపాలని కొట్టలేదంటూ కాళ్లావేళ్లాపడ్డాడంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.

ఆ మూడే కారణాలు

గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో ఏటా 200-300 వరకూ హత్య కేసులు నమోదవుతుంటాయి. వీటిలో కేవలం 10-20శాతం మాత్రమే పగ, ప్రతీకారాలతో పక్కా పథకం ప్రకారం ప్రత్యర్థులను హతమార్చుతున్నట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన కేసుల్లో అధికశాతం మద్యం మత్తు, క్షణికావేశంలోనే జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు, భూ వివాదాలు, ఆర్థిక విషయాలు కారణమవుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ హత్యలకు కేంద్రాలవుతున్నాయి.

మాటలతో పోయేదానికి

ఇటీవల ఎల్బీనగర్‌లో మద్యం మత్తులో మాటామాటా పెరిగి హత్యకు దారితీసింది. ఇరువర్గాల్లో ఏ ఒక్కరూ పక్కకు తప్పుకొని వెళ్లినా అంతవరకూ వచ్చేది కాదంటున్నారు పోలీసులు. అవతలి వారిపై పట్టలేని కోపంతో ఊగిపోతూ చేతికి దొరికిన బలమైన వస్తువుతో కొట్టడం వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. యూసుఫ్‌గూడలో పదోతరగతి విద్యార్థుల మధ్య క్రికెట్‌ ఆటలో మొదలైన వివాదం బాలుడిని బలితీసుకుంది. కన్నవారికి కడుపుశోకం మిగిల్చింది.

ఇంటా..బయటా చావుకేకలు

జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో అక్కను వేధిస్తున్న బావతో గొడవకు దిగారు బావమరుదులు. అక్కడ జరిగిన వివాదం ఘర్షణకు దారితీయటంతో ఇరువర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఘటనలో అన్నదమ్ములు వెంకటేష్, పోతురాజు హత్యకు గురయ్యారు. ఆలుమగల మధ్య తలెత్తిన మనస్పర్థలు. పెద్దల మధ్య కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవి. పరస్పరం మాట్లాడుకునే సమయంలో మాటామాటా పెరిగి కోపావేశాలకు లోనయ్యారు. ఎవరికి వారే బలబలాలు ప్రదర్శించేందుకు తెగించటంతో దారుణం జరిగిందంటున్నారు జీడిమెట్ల పోలీసులు.

భూవివాదం.. రెండు హత్యలు

ఇబ్రహీంపట్నం కర్ణంగూడ వద్ద స్థల వివాదం.. స్థిరాస్తి వ్యాపారులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి హత్యలకు దారితీసింది. ఈ కేసులో కీలక నిందితుడు మట్టారెడ్డితో శ్రీనివాసరెడ్డి ఏడాది కాలంగా గొడవ పడుతున్నారు. ఇద్దరూ ఉన్నపుడు మాత్రమే పరస్పరం చేసుకునే బెదిరింపులు హత్యలు జరిగేంత వరకూ బయటపడలేదు. స్వల్ప వివాదంగా భావించిన పోలీసులు ఇది హత్యలకు దారితీస్తుందని అంచనా వేయలేకపోయారు.

వివాహేతర సంబంధం

రాజేంద్రనగర్‌లో వివాహేతర సంబంధం భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైంది. పద్ధతి మార్చుకోలేదనే కోపంతో అర్ధరాత్రి దాటాక పిల్లలు చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. ఆమె తలను కాగితాల్లో చుట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరాడు. అమ్మ దూరమై.. నాన్న జైలుపాలవటంతో వారి పిల్లలు బంధువుల ఇంట్లో అయోమయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రధాన శత్రువు మద్యం మత్తే

నగరం, శివార్లలో జరుగుతున్న హత్యలకు అధికశాతం మద్యంమత్తు, ఆర్థిక అంశాలు కారణమవుతున్నాయి. పరస్పర గొడవలను సర్దిచెప్పాల్సిన పెద్దలు కూడా ఇరువైపులా ఆజ్యం పోయటం కూడా హత్యలకు దారితీస్తున్నాయి. పంతం నెరవేర్చుకునేందుకు బంధాలు, భావోద్వేగాలు కూడా పట్టించుకోవట్లేదంటూ మానసిక నిపుణులు డాక్టర్‌ రాంచందర్‌ మోతుకూరి విశ్లేషించారు. మారుతున్న కాలంలో ఓపిక, సహనం తగ్గటం.. తామే ముందుండాలి, తమ మాటే చెల్లుబాటు కావాలనే పంతం కూడా హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని వివరించారు.

‘క్షణికావేశానికి గురై తాము ఏం చేస్తున్నామనే విచక్షణ కోల్పోయిన మానసిక స్థితి, మద్యం మత్తు హత్యలకు కారణమని జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు తెలిపారు. చేసిన నేరాలకు చట్టప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు. హత్య కేసులో జైలుకెళితే కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుందన్నారు. కన్నవారిపై ఆధారపడిన పిల్లలు అనాథలుగా మారతారని గుర్తుంచుకోవాలని సూచించారు.

మూడు పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో హత్యల వివరాలు:

సంవత్సరం నమోదైన హత్యకేసులు
2019 309
2020 237
2021 316
2022(ఫిబ్రవరి) 24(సుమారు)

ఇదీ చదవండి:ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి.. తాత, తండ్రి, మనుమడు మృతి..

ABOUT THE AUTHOR

...view details