ఈ-దొంగల్ని’ పట్టేదెలా? ఇప్పుడు పోలీసుల శాఖను వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఏడు నెలల వ్యవధిలో రాజధాని నగరంలోని రెండు బ్యాంకుల నుంచి దాదాపు రూ.14కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరస్థులు ఎవరన్నది తేలలేదు. తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ అపెక్స్ బ్యాంకులో రూ.1.96 కోట్లు కొల్లగొట్టి ఏడాది దాటినా దళారులు దొరికారు.. అసలు నేరస్థులు ఎవరన్నది మిస్టరీగానే మిగిలింది. రెండు బ్యాంకుల్ని దోచుకున్న విధానం ఒకేలా ఉండటం, దీనికి పాల్పడ్డ నిందితులు దొరక్కపోవడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో సైబర్ నేరాల పెరుగుదల మిగతా వాటితో పోల్చుకుంటే వందశాతం పైగానే ఉంటోంది. మాయమాటలతో వ్యక్తిగత ఖాతాల్లో డబ్బు కొల్లగొట్టడం, ఓఎల్‌ఎక్స్ మోసాల వంటి వాటి విషయంలో పోలీసులు నిందితులను గుర్తించగలుగుతున్నారు. చాలా కేసులలో అరెస్టు చేయగలుగుతున్నారు. కానీ, బ్యాంకులనే కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను గుర్తించడంలోనే దర్యాప్తు ముందుకెళ్లడంలేదు. ఇందులో బ్యాంకుల నిర్లక్ష్యం ఉన్నా.. ఉనికి బయటపడకుండా నేరస్థులు తీసుకుంటున్న జాగ్రత్తలు పోలీసులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
తెలంగాణ అపెక్స్ బ్యాంకు ఉదంతమే ఇందుకు నిదర్శనం. శేరిలింగంపల్లికి చెందిన ఇద్దరు సోదరులతో ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకున్న అజ్ఞాత వ్యక్తులు వారి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. వాటి ద్వారా బ్యాంకు సర్వర్‌లోకి చొరబడ్డారు. ఈ సోదరుల ఖాతాలోకి రూ.2 లక్షలు, సికింద్రాబాద్‌లోని మరో ఖాతాలోకి రూ.1.94 లక్షలు మళ్లించారు. మళ్ళీ ఈ రూ.1.94 లక్షలను అక్కడ నుంచి దేశంలోని పది వేరువేరు ఖాతాల్లోకి బదిలీ చేశారు. పోలీసు దర్యాప్తులో బ్యాంకు సర్వర్‌లోకి చొరబడ్డ ఖాతాలను గుర్తించారు.