Ex Mla Erra shekhar: సోదరుడి హత్యకేసులో నిందితుడిగా ఉన్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు ఊరట లభించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పునిచ్చింది. ఎర్ర శేఖర్ భార్య భవానీ, మరో ఏడుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2013 జూలై 17న ఎర్రశేఖర్ సోదరుడు ఎర్ర జగన్‌మోహన్ హత్యకు గురయ్యాడు. దేవరకద్ర బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో జగన్‌మోహన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న దేవరకద్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఆయన భార్య భవానీతో పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు.
దేవరకద్ర మండలం పెద్దచింతకుంట గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎర్ర శేఖర్, ఆయన సోదరుడు ఎర్ర జగన్‌మోహన్ మధ్య గొడవ తలెత్తినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎర్ర శేఖర్ భార్య భవానీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఎర్ర జగన్‌మోహన్ భార్య అశ్విత సైతం నామినేషన్ దాఖలు చేయడం విబేధాలకు కారణమైంది. జగన్‌మోహన్ హత్య కేసులో దేవరకద్ర పోలీసులు ఎర్రశేఖర్, భవానీతో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు. కేసును విచారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది.