టాలీవుడ్ మత్తుమందుల కేసులో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సుధీర్ఘంగా విచారించారు. తొలిరోజు విచారణలో భాగంగా హాజరైన పూరీపై దాదాపు 11 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో సినీపరిశ్రమ(Cini Industry)కు చెందిన 12 మందిని విచారణకు హాజరవ్వాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట తనయుడు ఆకాశ్, చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీధర్ ఉన్నారు. చివర్లో నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఉదయం 10.12 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన జగన్నాథ్‌ను అధికారులు రాత్రి 8.45 గంటల వరకు విచారించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలపై అధికారులు ఆరా తీశారు. 2017లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దర్యాప్తులో టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అంతకుముందు రెండేళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు సమాచారం.
ప్రశ్నల వర్షం...
ఎక్సైజ్‌శాఖ అప్పటి దర్యాప్తులో కెల్విన్ మస్కరెన్హస్, మైక్ కమింగా, రాన్సన్ జోసెఫ్, అలెక్స్ విక్టర్, మహ్మద్ ఉస్మాన్, అబూ బాబర్ తదితరులు విదేశాల నుంచి మాదకద్రవ్యాల్ని తెప్పించినట్లు తేలడంతో వారివద్ద నుంచి ఎవరెవరు కొనుగోలు చేశారు? డబ్బు ఎలా చెల్లించారు? విదేశాలకు చెల్లింపులు జరిగాయా? తదితర వివరాలను ఆరా తీయడంపైనే ఈడీ దృష్టి సారించింది. పూరీని ఆర్థిక లావాదేవీల గురించి అడిగినట్లు తెలిసింది. ఆయనను, చార్టర్డ్ అకౌంటెంట్‌ను వేర్వేరుగా విచారించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లను వెంట తీసుకొచ్చిన జగన్నాథ్ వాటిని అధికారులకు సమర్పించినట్లు తెలియవచ్చింది.