ED On Karvy Case updates : కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి, సీఎఫ్ఓ కృష్ణహరిలను ఈడీ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా... ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా సమాచారం. డొల్ల కంపెనీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టి... రూ.2,783కోట్లను పార్థసారథి తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కార్వీ గ్రూప్స్‌లోని 14 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఆస్తులపై ఆరా..
Karvy Case parthasarathi : ఈ వ్యవహారంలో పార్థసారథితో పాటు కృష్ణహరి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పార్థసారథికి చెందిన రూ.700కోట్లు విలువ చేసే షేర్లను ఈడీ అధికారులు తాత్కాలిక జప్తు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సొంత ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారనే వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఇదీ చదవండి: Karvy Scam: కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ రూ.3520 కోట్ల మోసం
నాలుగు రోజుల కస్టడీ
Karvy Case: మనీలాండరింగ్ కేసులో కార్వీ ఎండీ పార్థసారథితో పాటు సీఎఫ్‌వో కృష్ణ హరిలను నాలుగు రోజుల కస్టడీలో భాగంగా విచారణకు తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు హైదరాబాద్ సీసీఎస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. 2,873 కోట్ల రూపాయలు దారిమళ్లించారని.. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులో తనఖా పెట్టినట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. కార్వీపై పలు పోలీసు స్టేషన్లలోనూ కేసులున్నాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి గ్రూపులోని పలువురు ఉద్యోగుల వాంగ్మూలం నమోదుచేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: Karvy scam: ‘కార్వీ’ కేసు దర్యాప్తులో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు